Language:
✨ Read & Publish Web Novels Worldwide
Thriller Telugu

మహానటి

Prasad ↗ Author • Published Jul 24, 2026

👁️ 41 Total Views

మహానటి

"ఈ కథలో ఒక నటి ఉంది... అవకాశాల కోసం ఎప్పుడూ తలవంచలేదు. అందుకే చివరికి జీవితమే ఆమెకు వంగింది. ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారి 'మహానటి' కథను చివరివరకు తప్పక చదవండి."


పార్ట్ 1: రంగస్థలం

“ఎంతో అపురూపంగా పెంచిన నా కొడుకుకి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా? నేనే తప్పు చేయలేదే? ఎవరినీ నేను నిందించలేదే? నాకు చేతనైనంత వరకూ ఇతరులకు సాయం చేశానే? అయినా నా మీద దయ లేకుండా, ఎందుకు నాకీ శిక్ష విధించావు భగవాన్?” భోరున విలపిస్తోంది సరోజ.

ఆమె భర్త ఆమెను అనునయిస్తున్నాడు. “చూడు సరోజా, మనకి పిల్లలు లేకపోవడం వలన అనాథాశ్రమం నుండి వాడిని తెచ్చుకుని పెంచుకున్నాం. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆరవ ఏట నుండీ వాడికి అనారోగ్యమే. వాడు బాగుండాలనే కదా, ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి వాడికి వైద్యం చేయించాం. ఎంత ఖర్చు అయినా మందులు కొనగలం కానీ, ఆయుష్షు కొనలేం కదా. వాడికీ మనకీ ఋణం తీరిపోయింది. ఏం చేస్తాం? ఇంటికి వెళ్దాం పద” అన్నాడు రాఘవ.

నర్సు వచ్చి “అమ్మా, ఇది హాస్పిటల్. మీరు అంత గట్టిగా ఏడవకూడదు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి, మీ అబ్బాయి బాడీని అప్పగిస్తారు సార్. మీరు బిల్ పే చేసేయండి. తర్వాత అంబులెన్సులో మీరు వెళ్లవచ్చు” అంది. నర్సు అలా చెప్పి వెళ్లగానే సరోజ మరోసారి ఘొల్లుమంది.

రాఘవ తమ్ముడు కిరణ్, “అన్నయ్యా, నువ్వు వదినను చూడు. నేను బిల్ కట్టేస్తాను” అని రిసెప్షన్ వైపు నడిచాడు. కొద్దిసేపటికి కిరణ్ వచ్చి “అన్నయ్యా బిల్ కట్టేశాను. అంబులెన్సు వచ్చింది వెళ్దాం” అని అన్నాడు.

అంబులెన్సు వచ్చింది అనగానే, సరోజ ‘బాబూ’ అని గట్టిగా కేకపెట్టి నేల మీద పడిపోయింది. రాఘవ ‘సరోజా.. సరోజా’ అంటూ ఆమెను ఒడిలోకి తీసుకుని, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘వదినా’ అని కంగారుగా కిరణ్ ఆమె వద్దకు వచ్చాడు. వారి కేకలకు నర్సు వచ్చి సరోజను చూసి, గబగబా డాక్టరుని తీసుకువచ్చింది. డాక్టర్ ఆమెను పరీక్షించి “సారీ రాఘవ గారు. మీ భార్య చనిపోయారు” అని చెప్పి వెళ్లిపోయారు. నర్సు ఆయనతో వెళ్లిపోయింది.

రాఘవ ఒడిలో సరోజ దీర్ఘనిద్రలోకి వెళ్లిపోయింది. రాఘవ కళ్లు శ్రావణ మేఘాలై వర్షిస్తున్నాయి. కిరణ్ భారమైన హృదయంతో అన్న, వదినల కేసి చూస్తున్నాడు.

‘ఋణానుబంధం.. అంతా ఋణానుబంధం’ అన్న పాట నెమ్మదిగా వినిపిస్తుండగా, తెర పడింది.

Reader Reviews & Discussion

Please log in to leave a review or reply.
★ 5/5

బాగుంది